prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 3:57 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జనగణన సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలి – అద్దె నివాసితులు తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవాలి*

ప్రజావాణి న్యూస్ (మే14)  దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న జనగణన కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక, విద్యా మరియు నివాస పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరించే అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమమని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక, మౌలిక వసతుల కల్పన వంటి అనేక అంశాలకు జనగణన ద్వారా సేకరించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.జనగణన ప్రక్రియలో భాగంగా నియమించబడిన ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు,నివాస పరిస్థితులు,విద్య,ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజలందరూ ఈ సిబ్బందికి సహకరించి సరైన మరియు పూర్తి వివరాలను అందించాలని కోరారు.ప్రత్యేకంగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు, ఉద్యోగులు విద్యార్థులు, వలస కార్మికులు మరియు ఇతర తాత్కాలిక నివాసితులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు తమ కుటుంబ సభ్యుల సంఖ్య,తదితర వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.జనగణన ద్వారా సేకరించే వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, చట్టపరమైన రక్షణ కల్పించబడుతుందని అధికారులు తెలిపారు. అందువల్ల ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు ధైర్యంగా సరైన సమాచారాన్ని అందించాలని కోరారు.అలాగే ఇంటి యజమానులు కూడా తమ భవనాలలో నివసిస్తున్న అద్దెదారుల వివరాలను జనగణన సిబ్బందికి తెలియజేసి సహకరించాలని సూచించారు. జనగణన సిబ్బంది అధికారిక గుర్తింపు కార్డులతోనే వస్తారని, ప్రజలు వారి వివరాలను పరిశీలించి సహకరించాలని తెలిపారు.జనగణన విజయవంతం కావడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజల సహకారంతో సమగ్ర మరియు ఖచ్చితమైన గణాంకాలను సిద్ధం చేయడం సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.