prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:22 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

చౌదరిగూడలో పౌర హక్కుల దినోత్సవ అవగాహన సదస్సు

ఘట్‌కేసర్, జూలై 30: ఉమ్మడి ఘట్‌కేసర్ మండలంలోని చౌదరిగూడ పురపాలక సంఘ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డీవీఎంసీ సభ్యుడు తాల్క రాములు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఘట్‌కేసర్ మండల యువ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ వార్డు సభ్యుడు నర్సింగ్ ముదిరాజ్ హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో పౌర హక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన డీవీఎంసీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1955 ప్రకారం అంటరానితనం పాటించడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ సాటి మనిషి పట్ల సోదరభావంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై వివక్ష ప్రదర్శించిన వారిపై చట్టప్రకారం శిక్షలు, జరిమానాలు విధించే నిబంధనలు ఉన్నాయని వివరించారు.

షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచార నిరోధక) చట్టం–1989 ప్రకారం ఎలాంటి అత్యాచారాలు, వివక్షకు పాల్పడినా లేదా వాటిని ప్రోత్సహించినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే గ్రామసభల్లో ప్రజలు తప్పనిసరిగా పాల్గొని పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కావ్య, జీపీఓ అశోక్ కుమార్, శ్రావణ్ కుమార్, మంజుల, భాగ్య, చంద్రశేఖర్, మధుసూదన్, జహీరుద్దీన్, భాగ్యలక్ష్మి, శ్యాంసుందర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.