*చిన్న పత్రికలను తక్కువ అంచనా వేయొద్దు..!*
*అక్రమ కలప రవాణా వ్యవహారంపై వార్త రాయడంతో విలేఖరులపై అవహేళన*
*మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మే 27*
గతంలో ఒక పత్రికలో విలేఖరిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం అక్రమ కలప రవాణా వ్యవహారంలో తన పేరు బయటకు రావడంతో చిన్న పత్రికలపై అవహేళనగా మాట్లాడటం జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజావాణి పత్రిక అక్రమ కలప రవాణాపై ఆధారాలతో వార్త ప్రచురించగా, స్పందించాల్సిన వ్యక్తి విషయంపై వివరణ ఇవ్వకుండా చిన్న పత్రికలను చిన్నచూపు చూస్తూ మాట్లాడటం పత్రికా విలువలను అవమానపరిచినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు విలేఖరిగా పనిచేసిన వ్యక్తి మీడియా బాధ్యతలు, వార్తల ప్రాముఖ్యత తెలుసుకుని ఉండాల్సిన సమయంలో, ఇప్పుడు అదే మీడియాపై విమర్శలు చేయడం విచారకరమని జర్నలిస్టులు పేర్కొంటున్నారు. అక్రమ కలప రవాణా జరుగుతుందనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వకుండా వార్త రాసిన పత్రికలపై విమర్శలు చేయడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు.
“పత్రిక చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు… ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే మీడియా ధర్మం” అని పలువురు సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, అక్రమాలు, అవినీతి అంశాలను వెలికితీసే ప్రతి పత్రికను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
అక్రమ కలప రవాణాపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు బయటపెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిన్న పత్రికలను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తిపై జర్నలిస్టు సంఘాలు కూడా స్పందించాలని డిమాండ్ వినిపిస్తోంది.