prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 1:32 am Digital Edition : ANIL CHIGURUMAMIDI

చిగురుమామిడి లో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా, రాస్తారోకో

మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబు దాడులను ఖండించాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించాలని చిగురుమామిడి మండల సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలని కోరారు.సీపీఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ సిలిండర్లతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందే స్వామి మాట్లాడుతూ… పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా తగ్గి ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని అన్నారు. యుద్ధ వాతావరణాన్ని కారణంగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులు, వంటగ్యాస్ ధరలను పెంచుతుందని విమర్శించారు. గ్యాస్ కొరతను నివారించి పాత ధరలకే సిలిండర్లను అందించాలని డిమాండ్ చేశారు.అంతర్జాతీయ పరిణామాలను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గ్యాస్ గోదాముల వద్ద ప్రజలు క్యూల్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హోటళ్లు, హాస్టళ్లలో కూడా గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.సీపీఐ నాయకులు రోడ్డుపై రాస్తారోకో చేయడంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం ఎస్సై పృధ్విధర్ గౌడ్ అక్కడికి చేరుకుని నాయకులతో చర్చించి రాస్తారోకోను విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోలి బాపురెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, గూడెం లక్ష్మి, అందే చిన్నస్వామి, మావురపు రాజు, గందె కొమురయ్య, కయ్యం తిరుపతి, ఉస్మాన్ పాషా, అనువోజు జనర్దన్, నేరెళ్ల మొండయ్య, కోతి కనుకయ్య, చందబోయిన కనుకయ్య, మ్యాదరి పోచయ్య, వంగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.