ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు దొబ్బల బాబు
విచారణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించిన డి పి ఓ
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి); కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఖాజా మొయినుద్దీన్ (ఇన్‌చార్జ్ MPO/MPDO) పై నిధుల దుర్వినియోగం, పరిపాలనా అక్రమాలు, అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో విచారణకు చర్యలు ప్రారంభమయ్యాయి.కరీంనగర్ డివిజనల్ పంచాయతీ అధికారి మండల పరిషత్ అభివృద్ధి అధికారికి లేఖ పంపి గత 15 సంవత్సరాలకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించారు. క్యాష్ బుక్స్, వౌచర్లు, మెజర్‌మెంట్ బుక్స్, స్టాక్ రిజిస్టర్లు, యుటిలైజేషన్ సర్టిఫికేట్లు, ఆడిట్ రిపోర్టులు, వర్క్ ఫైళ్ళు, అటెండెన్స్ రిజిస్టర్లు, ఫైనాన్స్ కమిషన్ నిధుల వివరాలు తదితర పత్రాలు వెంటనే అందజేయాలని పేర్కొన్నారు.అవసరమైన రికార్డులు సమర్పించకపోతే అది అధికారిక రికార్డులను దాచినట్లుగా పరిగణించి, విచారణలో సహకరించకపోవడం మరియు విధి నిర్వర్తనలో నిర్లక్ష్యంగా భావించి సంబంధిత సర్వీస్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డుల సమర్పణలో ఆలస్యం లేదా లోపం జరిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ఈ అంశంపై దరఖాస్తుదారు తెలంగాణ ముఖ్యమంత్రి ను కూడా ఆశ్రయించినట్లు పేర్కొంటూ, విషయం అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని సూచించారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకుని అన్ని రికార్డులను సమర్పించి పారదర్శకంగా, సమగ్రంగా విచారణ జరిపేందుకు సహకరించాలని ఆదేశించారు.