prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 1:32 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్కేసర్ రైల్వే వంతెనకు రూ.3.87 కోట్ల నిధులు మంజూరు

ఘట్కేసర్, మే 5(ప్రజావాణి): ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో మొత్తం రూ.3,87,54,833 విడుదల చేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.

ఈ నిధులు మే 5న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాలో రెండు విడతలుగా జమయ్యాయి. మొదటి విడతగా రూ.2,90,22,744, రెండో విడతగా రూ.97,32,089 జమ అయినట్లు అధికారులు తెలిపారు. మెడ్చల్–మల్కాజిగిరి పరిధిలోని ఘట్కేసర్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణ పనుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

నిధుల మంజూరులో మెడ్చల్ నియోజకవర్గం డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ, ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. వెంటనే స్పందించి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి తదితరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మున్సిపల్ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు మాట్లాడుతూ, రైల్వే వంతెన నిర్మాణం పూర్తయితే ఘట్కేసర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతో స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.