prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:44 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో యువతి అదృశ్యం..ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రోషిణి అస్తానే అనే యువతి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌లోని బుగ్గబాయిలో నివాసముంటున్న అనిత అస్తానే కుమార్తె రోషిణి అస్తానే ఘట్‌కేసర్‌లోని కృష్ణ మార్ట్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 6న ఉదయం సుమారు 9 గంటలకు విధులకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె రెండు ఫోన్ నంబర్లకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆందోళనకు గురయ్యారు.

ఆమె కోసం పనిచేసే ప్రదేశంతో పాటు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద గాలించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన యువతి వివరాలు: రోషిణి అస్తానే, వయస్సు 20 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5 అడుగుల 3 అంగుళాలు, సాధారణ వర్ణం. ఇంటి నుంచి వెళ్లే సమయంలో పింక్‌, తెలుపు రంగు టాప్‌, పింక్ రంగు ప్యాంట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

యువతి ఆచూకీ తెలిసిన వారు లేదా ఆమెను ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌కు లేదా 100 / 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.