గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు – 2 భూ బాధిత రైతులకు ఊరట..
ఎకరానికి రూ.40 లక్షలు, హెచ్ఎండిఏ పరిధిలో ఒక ప్లాటు
రైతుల తరఫున ప్రభుత్వంతో మూడు గంటలపాటు చర్చలు జరిపిన “ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్”
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమక్షంలో కుదిరిన కీలక ఒప్పందం
షాద్‌నగర్ రైతుల సమస్యల పరిష్కారానికి వారధిగా నిలిచిన ఎమ్మెల్యేకు రైతుల కృతజ్ఞతలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు–2 నిర్మాణానికి సంబంధించి షాద్ నగర్ నియోజక వర్గంలో భూములు కోల్పోతున్న రైతులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం వెలువడింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని చుక్కమెట్టు, ముటుపూరు, ఉమ్మెంతాల, లాలాపేట, తుమ్మలపల్లి, లచ్చంపేట గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులకు తగిన నష్టపరిహారం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రైతుల తరఫున అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. గతంలో అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేలు నిర్వహించి, భూ సర్వే నంబర్లను ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించగా, రైతుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, షాద్‌నగర్ ఆర్డీఓ సరిత తదితర అధికారుల సమక్షంలో రైతులతో కలిసి సుమారు మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. రైతుల అభిప్రాయాలు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఎకరానికి రూ.40 లక్షల నష్టపరిహారంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఒక ప్లాటు కేటాయించే విధంగా అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో భూములు కోల్పోతున్న రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వంతో చర్చలు జరిపి మెరుగైన నష్టపరిహారం సాధించిపెట్టిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ స్థాయిలో రైతుల తరఫున అధికారులతో చర్చలు జరపలేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, షాద్‌నగర్ ఆర్డీఓ సరిత, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి, కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొవ్వూరి పురుషోత్తం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.. *KP*