prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 3:31 pm Digital Edition : SRINIVAS RAMAGUNDAM

గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి:

గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి:

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి జులై 09

ఇందిరమ్మ గృహాల అర్హుల
జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి

ఎంపీడీవోల సమన్వయంతో పారదర్శకంగా గృహాల ధృవీకరణ పూర్తి చేయాలి

గ్రామాల సమగ్రాభివృద్ధికి గ్రామాల అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన అవగాహన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి, చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మంజూరైన నిధులతో పూర్తయిన పనులను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీ తమ పరిధిలోని సహజ వనరులు, స్థానిక ఆదాయ వనరులను గుర్తించి ఆదాయాన్ని పెంచుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీలు ఆర్థికంగా బలోపేతమైతేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రతి ఇంటి నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉపాధి హామీ పథకం కింద జాబ్‌కార్డు కలిగిన ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మహిళా సంఘాల కార్యకలాపాలకు ఉపయోగపడే వీఓ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు.

రాబోయే మూడు సంవత్సరాల కాలానికి ప్రతి గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని, అది కేవలం పత్రాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదించిన గృహాల అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) ఈ ప్రక్రియను సమన్వయం చేస్తూ తమ పరిధిలోని గెజిటెడ్ అధికారులకు ధృవీకరణ బాధ్యతలు కేటాయించాలని సూచించారు. గృహాల అర్హత నిర్ధారణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.