బెజ్జంకి -కోహెడ మే 3(ప్రజావాణి )
సిద్దిపేట కోహెడ మండలం కూరెళ్ళ గ్రామంలో గ్రామస్తులు రెండు రోజుల బొడ్రాయి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. మొదటి రోజు శనివారం గ్రామ ఆడపడుచులు గంగా జలాన్ని తీసుకెళ్లి ” శ్రీదేవి- భూదేవి”( బొడ్రాయి బండలపై ) లకి జలాభిషేకం చేశారు. రెండవ రోజు ఆదివారం డప్పు చప్పుళ్లతో, శివసత్తుల పూనకాలతో , చిన్నారుల కేరింతల నడుమ, ఆడపడుచుల కోలాటాలతో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అనంతరం ఆడపడుచులకు ఒడి బియ్యం పోసి , సారీ చీర పెట్టి సంతోషంగా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ఆదర్శ దంపతులైన అనుభవాజ్ఞలు చిట్యాల కొమురయ్య , కొమురవ్వలు బొడ్రాయి పండుగ విశిష్టతను నేటి యువతకు వివరించారు. ఎన్నో నూతన ఆవిష్కరణలు జరిగిన , సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ పల్లెల్లో బొడ్రాయి పండుగను జరుపుకోవాలని, గ్రామదేవతలను పూజించుకుంటే పల్లెల్లో పిల్లా పాపలు గోదా , పంటలు సుభిక్షంగా ఉంటాయని పండుగ విశిష్టతను వివరించిన తీరు గ్రామస్తులను ఆకర్షించింది.