prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 12:39 pm Digital Edition : VENU THIRUMALAYAPALEM

గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్లక్ష్యం..

రోడ్లపై కారుతున్న వేస్ట్ డస్ట్‌తో వాహనదారులకు నరకయాతన..

అరెంపుల,కొండాపురం మధ్య ప్రయాణం ప్రమాదకరం.

చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న ప్రజలు..

పాలేరు(ఖమ్మం రూరల్), ప్రజావాణి, మే 22..

ఖమ్మం రూరల్ మండలంలోని అరెంపుల, కొండాపురం గ్రామాల మధ్య ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న గ్రానైట్ వేస్ట్ డస్ట్‌ను లారీలలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా లోడింగ్ చేసి తరలించడం వల్ల రోడ్లన్నీ ధూళితో నిండిపోతున్నాయి. లారీలపై సరైన కవర్లు లేకుండా భారీగా డస్ట్ తీసుకెళ్తుండటంతో ప్రయాణమంతా రోడ్లపై డస్ట్ కారుతూ వెళ్తోంది.ఈ పరిస్థితుల వల్ల ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పేరుకుపోయిన డస్ట్ కారణంగా వాహనాలు జారిపడే ప్రమాదం పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా లారీలు వెళ్తున్న సమయంలో ఎగిసే ధూళి వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రతిరోజూ ఈ రహదారిపై ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.గ్రానైట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్లపై కారుతున్న డస్ట్ వల్ల పరిసర గ్రామాల్లో గాలి కాలుష్యం కూడా పెరుగుతోందని, ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ డస్ట్ బురదగా మారి మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, గ్రానైట్ వేస్ట్ తరలిస్తున్న లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లారీలకు తప్పనిసరిగా కవర్లు ఏర్పాటు చేయించడం, ఓవర్‌లోడింగ్‌ను అరికట్టడం, రోడ్లపై పడుతున్న డస్ట్‌ను తరచూ శుభ్రం చేయించడం వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యాలపై జరిమానాలు విధించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వాహనదారులు, స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.