గోపాల్పూర్‌లో ఘనంగా 1987–88 పదో తరగతి విద్యార్థుల ఫ్రెండ్షిప్ డే వేడుకలు
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గోపాల్పూర్ గ్రామంలో 1987–88 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆత్మీయంగా సమావేశమై వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొత్తం 86 మంది విద్యార్థులు ఒకేచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుకుంటూ తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
సుమారు 39 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న ఈ స్నేహితులు నేటికీ అదే ఆప్యాయత, అనుబంధంతో కలిసికట్టుగా ఉండటం విశేషం.ప్రతి సంవత్సరం ఇదే విధంగా కలుసుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, అందరూ ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బ్యాచ్ టీం అధ్యక్షుడు మంగలంపల్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ“గెట్ టుగెదర్ ప్రారంభమైన నాటి నుంచి మనమంతా ఐక్యంగా కొనసాగుతున్నాం. మన మధ్య ఉన్న ఈ స్నేహబంధం ఎప్పటికీ విడిపోకుండా,ప్రతి సంవత్సరం ఇలాంటి ఫ్రెండ్షిప్ డే వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించుకుందాం. అందరం ఎల్లప్పుడూ ఐకమత్యంతో ముందుకు సాగాలి”అని పిలుపునిచ్చారు.
బోయినపల్లి తిరుపతిరావు మాట్లాడుతూ, “స్నేహబంధం అనేది మాటల్లో చెప్పలేనంత గొప్పది. అవసరమైతే ప్రాణాలకైనా నిలబడే బంధం.39 సంవత్సరాలుగా స్నేహితులు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా కొనసాగడం మనందరికీ గర్వకారణం”అని అన్నారు.
బోయినపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ“ఇప్పటికీ మనమంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండటం మన అందరి గొప్పతనం.చిర్ర ఉదయచందర్ మాట్లాడుతూ ఈ అనుబంధం శాశ్వతంగా కొనసాగాలని,ప్రతి సంవత్సరం ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తూ స్నేహాన్ని మరింత బలపరుచుకుందాం” అని పేర్కొన్నారు.
చివరగా బ్యాచ్ సభ్యులందరూ ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ స్నేహబంధం చిరస్థాయిగా కొనసాగాలని ఆకాంక్షించారు.