prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:39 pm Digital Edition : SRIKANTH MULUGU

గోదావరి వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి .జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్.

.ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి ).

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం *మూడో ప్రమాద హెచ్చరిక* కి చేరుకున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్ పి సూచించారు.

ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు, బ్యాక్‌వాటర్ ప్రభావిత గ్రామాల ప్రజలు పరిస్థితులను నిరంతరం గమనిస్తూ పోలీసు, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఏటూరునాగారం, వాజేడు, మంగపేట పేరూరు కన్నాయిగూడెం వెంకటాపురం మండలాల్లోని గోదావరి నది పరివాహక ప్రాంతాలు, బ్యాక్‌వాటర్ ప్రభావిత గ్రామాల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ సూచించారు. అవసరమైతే అధికారులు సూచించే సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలివెళ్లాలని తెలిపారు.

మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లరాదని, వరద ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో నదిలోకి దిగడం, పడవల ద్వారా ప్రయాణించడం, సాహసాలకు పాల్పడడం ప్రాణాపాయమని హెచ్చరించారు.

అలాగే గోదావరి ఒడ్డున నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు చిన్నారులను నది వద్దకు వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.

జిల్లా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసు అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్ పి గారు తెలిపారు.

బై రిపోర్టర్‌ గొల్లపెల్లి శ్రీకాంత్