గురుకుల పాఠశాలకు జనసేన తరఫున సౌండ్ సిస్టమ్ విరాళం.. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యపై అవగాహన
పెనుమారు (ప్రజావాణి ప్రతినిధి) ఆగస్ట్ 6
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ పాఠశాలకు జనసేన పార్టీ తరఫున రూ.18 వేల విలువైన సౌండ్ సిస్టమ్‌ను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున ఈ సౌండ్ సిస్టమ్‌ను జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న పాఠశాల యాజమాన్యానికి అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే మంచి నడవడి, కష్టపడి చదవడం ఎంతో అవసరమని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం రెండు ప్రధాన సమస్యలను డాక్టర్ యుగంధర్ పొన్న దృష్టికి తీసుకువచ్చింది. పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులు కూర్చునేందుకు శాశ్వత షెడ్డు ఏర్పాటు చేయాలని, అలాగే అక్టోబర్ నెలలో నిర్వహించనున్న జోనల్ క్రీడా పోటీల కోసం క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరింది. ఈ రెండు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పాఠశాల అభివృద్ధికి సహకరించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభావతి, ఉపాధ్యాయులు జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాఘవ, సరిత, మమత, అన్నామలై, ప్రిన్సిపాల్ ప్రభావతి, దమయంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
