prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:26 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గుంటూరు నగర అభివృద్ధి పనులపై కమిషనర్ సమీక్ష ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3, శంకర్ విలాస్ ఆర్‌వోబీ, మిర్చియార్డ్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం

ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరానికి కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3,మిర్చియార్డ్ సమీప ఫ్లైఓవర్,శంకర్ విలాస్ ఆర్‌వోబీ నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రస్తుతం చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు భవిష్యత్తులో నగరానికి తలమానికంగా నిలుస్తాయని పేర్కొన్నారు.పనులు నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత కాలపరిమితిలో పూర్తి కావాలని సూచించారు.శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేసేలా కాంట్రాక్టర్ అవసరమైన నిర్మాణ సామగ్రి,కార్మికులను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.పనుల సమయంలో ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనులను ఆగస్టు నెలాఖరులోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వేగవంతంగా చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజారోగ్య ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్,విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదేవిధంగా మిర్చియార్డ్ సమీప ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేవని,జూలై 15 నాటికి పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగాలని కమిషనర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ డి.శ్రీనివాస్,జీఎంసీ ఎస్‌ఈ జి.వెంకటేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, సీఆర్డీఏ సీనియర్ ఇంజినీర్ సాయి,ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్,ఏపీసీపీడీసీఎల్, ఆర్ & బీ,ఎన్‌హెచ్‌ఐ అధికారులు, సంబంధిత ప్రాజెక్టుల కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు