prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 3:20 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

గుంటూరులో రూ.8 కోట్ల భూమి వివాదం*బినామీ పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్‌ఆరోపణలు*మాజీ ఎమ్మెల్యేపై ఆదాయపు పన్ను శాఖకు ఫిర్యాదు

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్( మే 12)గుంటూరు నగరంలో కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.8 కోట్ల విలువ చేసే భూమిని బినామీ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటూ మాజీ పోనూరు శాసనసభ్యుడు కిలారి వెంకట రోసయ్యతో పాటు మరో ముగ్గురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ప్రకాశ్‌నగర్‌, కొతపేటకు చెందిన ఉప్పలపాటి మునయ్య ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుదారు మునయ్య తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరులోని చుట్టుగుంట రోడ్ నుంచి చిలకలూరిపేట రోడ్ వరకు, కేకేఆర్ సినిమా హాల్ వెనుక భాగంలో ఉన్న 1548 చదరపు గజాల భూమి తనకు మరియు తన బంధువు గుమ్మడి భారతికి చెందినదని పేర్కొన్నారు. అయితే ఈ భూమికి సంబంధించిన అసలు పత్రాలను పక్కనబెట్టి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్‌ చేపట్టినట్లు ఆరోపించారు.మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య తన అనుచరులైన కిలారి రామబ్రహ్మం, జక్క శ్రీకాంత్‌, తల్లూరి శ్రీనివాసరావు పేర్లతో భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారని మునయ్య ఆరోపించారు. ఈ ముగ్గురు సాధారణ ఆదాయం కలిగిన వ్యక్తులని, కోట్ల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత వారికి లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరు కేవలం బినామీలుగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.అంతేకాకుండా భూమి కొనుగోలు లావాదేవీలను ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించలేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు మరియు రిజిస్ట్రేషన్‌ ఫీజులు కూడా తప్పించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమ రిజిస్ట్రేషన్‌లను రద్దు చేసి, సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మునయ్య అధికారులను కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులకు సమర్పించినట్లు తెలిపారు.ఈ ఫిర్యాదుపై ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్‌ శాఖలు ఎలా స్పందిస్తాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.