prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 12:12 am Digital Edition : NARESH HUZURNAGAR

గాలి దుమారంతో ఇల్లు కోల్పోయిన వృద్ధురాలికి అండగా మంత్రి ఉత్తమ్.

బాధితురాలికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు
సూర్యాపేట, మే 28: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సంతో ఇల్లు కోల్పోయి నిలువనీడ లేక ఇబ్బందులు పడుతున్న వృద్ధురాలికి రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అండగా నిలిచారు. గాలి దుమారానికి రేకుల ఇల్లు ఎగిరిపోవడంతో ఆశ్రయం కోల్పోయిన బాధితురాలికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను ఆదేశించారు.
జిల్లాలోని మట్టంపల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన తాళ్లూరి జయమ్మ నివసిస్తున్న రేకుల ఇంటి పైకప్పు ఈదురుగాలులకు పూర్తిగా దెబ్బతింది. గాలికి రేకులు ఎగిరిపోవడంతో ఆమె నిలువనీడ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యంలో తలదాచుకునే చోటు లేక ఆమె పడుతున్న అవస్థల విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి చేరింది.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి మానవతా దృక్పథంతో సమస్యను పరిష్కరించాలని సూచించారు. బాధితురాలికి తక్షణ సహాయం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కింద వెంటనే ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు.