బెజ్జంకి,జూలై 14 (ప్రజావాణి)
గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదుల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. దోమలు, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. అలాగే విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన పరిసరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రల జానకి రాజు మాట్లాడుతూ, గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా పిల్లలు చదువుకునే పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రతి నెలా నిర్వహిస్తామని తెలిపారు.
గ్రామ ప్రజలు ఇంటింటా పరిశుభ్రత పాటించి, చెత్తను చెత్త కుండీల్లో వేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, వివో అధ్యక్షురాలు ముత్యం శోభ, మేడి బాలయ్య, మేడి శ్రీనివాస్, కల్లేపల్లి తిరుపతి, ఎర్రల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.