ఘట్కేసర్, జూలై 16: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్‌లోని ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా ప్రసిద్ధి చెందిన గరుడాద్రి క్షేత్రంలో శ్రీ గోదాదేవి (ఆండాళమ్మ) తల్లికి జూలై 19న (ఆదివారం) లక్ష గాజుల మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ విశిష్ట ఉత్సవంలో భాగంగా, భక్తుల ఆరాధన పొందుతున్న ఆండాళమ్మ తల్లికి లక్ష గాజులను సమర్పించనున్నారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో “గాజులమ్మ”గా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ వంశస్థులు పవనాచార్యులు తెలిపారు.
ఉత్సవ కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తూ, జూలై 19న ఉదయం 10 గంటలకు గజవాహన సేవ, ఉదయం 11 గంటలకు లక్ష గాజుల మహోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు కుంకుమార్చన, అనంతరం తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
గరుడాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ గోదాదేవిని భక్తులు ప్రేమగా “గాజులమ్మ”గా పిలుస్తారని, భక్తిశ్రద్ధలతో సమర్పించిన గాజులను అమ్మవారికి అర్పిస్తే సౌభాగ్యం, సంతానప్రాప్తి, వివాహయోగం, కుటుంబ సుఖశాంతి, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసమన్నారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం గాజులు సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన అనుభవాలను అనేక మంది భక్తులు పంచుకుంటుంటారని పేర్కొన్నారు.
లక్ష గాజుల మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి గాజులు సమర్పించడం ద్వారా కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, శుభఫలితాలు చేకూరుతాయని విశ్వసిస్తూ ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారని తెలిపారు.
ఈ దివ్య మహోత్సవానికి భక్తులు కుటుంబ సమేతంగా హాజరై తమ శక్తికొద్దీ గాజులు సమర్పించి శ్రీ గోదాదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పవనాచార్యులు, ఫణికుమార్ ఆచార్యులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
