*ఖమ్మం జిల్లాలో మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి బీఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు*
*మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి జూన్ 29*
ఖమ్మం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని కొన్ని మెడికల్ షాపుల్లో అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు లేకుండానే ఔషధాల విక్రయం జరుగుతోందనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
ఖమ్మం జిల్లాలో అసిస్టెంట్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (ఏ డి ఐ), డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (డి ఐ ) అధికారుల నిర్లక్ష్యం వల్లే ఫార్మసీ చట్టాలు, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్ట నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. తనిఖీలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల అర్హత లేని వ్యక్తులు మందులు విక్రయించడం, డాక్టర్ సూచించిన మందులకు బదులుగా ప్రత్యామ్నాయ మందులు ఇవ్వడం, ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నిర్వహించడం వంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఖమ్మం జిల్లాలోని అన్ని మెడికల్ షాపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు విధుల్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏ డి ఐ, డి ఐ అధికారులపై కూడా శాఖాపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, ఖమ్మం జిల్లాలో ఫార్మసీ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.