వైయస్సార్ కడప జిల్లా ప్రజా వాణి న్యూస్ (ఏప్రిల్20) రాజుపాళెం ఉన్నత పాఠశాల వార్షికోత్సవ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ఎల్లారెడ్డి ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.ఎల్లారెడ్డి పేర్కొన్నారు.సోమవారం ఉదయం బద్వేల్ మండల పరిధిలోని రాజుపాళెం ఉన్నత పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవ సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టాలని, చదువుతోనే ఏదైనా సాధించవచ్చని,మనిషి మనుగడకు చదువు,సంస్కారం ఎంతో అవసరమని సూచించారు.విద్యార్థులు వేసవి సెలవులలో సమయాన్ని వ్యర్థం చేయకుండా చదవడం,రాయడంపై దృష్టి పెట్టాలన్నారు. ఒక సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో ప్రతి విద్యార్థికి అభ్యసన అనేది అంతే అవసరమని, అభ్యసన ద్వారానే విద్యార్థి ఆయుధం అనే జ్ఞానం,శక్తిని సంపాదిస్తారని పేర్కొన్నారు.అభ్యసన ద్వారానే మానసిక దృఢత్వం,ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. తద్వారానే జీవితంలో విజయం సునాయసమవుతుందని పేర్కొన్నారు.
తెలుగు ఉపాధ్యాయులు మాదన విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని,అందుకు తగ్గట్టుగానే తన ఆలోచన,తపన,కృషి,పట్టుదల ఉండాలన్నారు. విద్యార్థుల అభ్యసన ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. నేటి కాలంలో అవసరానికి మించి వాడుతున్న పరికరం మొబైల్ ఫోన్ అని, ఇది సమయాన్ని వృధా చేయడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత లేకుండా చేస్తుందని, మెదడుపై, కంటి చూపుపై ప్రభావాన్ని చూపిస్తుందన్నారు.నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే లభిస్తుందని,కార్పొరేట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ విద్యా రంగం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చూపకూడదన్నారు.విద్యార్థి సర్వతోన్ముఖాభివృద్ధికి పాటుపడేది ప్రభుత్వ పాఠశాలలేనని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేస్తే,ఊరి బడి కనుమరుగవుతుందని,తద్వారా పేదలకు విద్య దూరమవుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు.ప్రభుత్వ బడులలోనే తమ పిల్లలను చేర్పించి ఊరి బడిని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎన్.బాల ఓబన్న, జి.ఆంథోని రావు,పట్టెం వెంకటసుబ్బారెడ్డి,శ్రీకాంత్,సరస్వతి,బి.థామస్,ఎన్.శ్రీధర్ రెడ్డి,ఎల్.వెంకట రెడ్డి, విద్యా కమిటీ చైర్మెన్ కె.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.