prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 6:28 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కోటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మే 27 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వెల్గాటూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి. ఉదయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుధవారం శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి ఆలయ ప్రాంగణం, వాహనాల పార్కింగ్ స్థలాలు, అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఉదయ్ కుమార్ మాట్లాడుతూ… ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు, స్థానిక ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆలయ పరిసరాల్లో గానీ, గ్రామంలో గానీ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు స్థానికులు సహకరించాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయగలమని ఎస్సై స్పష్టం చేశారు. ప్రజల రక్షణే ధ్యేయంగా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బందితో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.