prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 12:18 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

కొర్రెములలో సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు….. డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : సీఐ కనకయ్య గౌడ్

ఘట్‌కేసర్, జూలై 16 : రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కొర్రెముల గ్రామంలో గురువారం సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్‌పై భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక యువత సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ సీఐ కనకయ్య గౌడ్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యసనాల బారిన పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.  డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఐ కనకయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్, ఎస్ఐలు నాగేశ్వరరావు, విజయ్ కృష్ణ, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.