•కేజీఆర్ ఎన్‌క్లేవ్‌లో బిల్డర్ నిర్వాకం.. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ లేక అపార్ట్‌మెంట్ నివాసితులు, కాలనీవాసుల అవస్థలు
అమీన్పూర్, జూన్ 13(ప్రజావాణి) :అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కేజీఆర్ ఎన్‌క్లేవ్‌లో పూర్తయిన అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో అపార్ట్‌మెంట్ నివాసితులతో పాటు పరిసర కాలనీవాసులు తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తై నివాసితులు ఉంటున్నప్పటికీ, ఏర్పాటు చేయాల్సిన ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్‌కు అనుసంధానం చేయడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్ పడుతోంది. దీంతో తరచూ ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యాన్ని మించి విద్యుత్ వినియోగం జరుగుతూ, కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్య కారణంగా అపార్ట్‌మెంట్‌లోని నివాసితులతో పాటు చుట్టుపక్కల కాలనీల ప్రజలు కూడా గంటల తరబడి విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. లిఫ్టులు నిలిచిపోవడం, తాగునీటి మోటార్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యను పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అపార్ట్‌మెంట్ యాజమాన్యం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడుతున్న అదనపు భారాన్ని తొలగించి, కాలనీవాసులకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాలనీవాసులు హెచ్చరించారు.

