prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 7:45 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

కులాల గడపలు దాటుదాం.. హిందూ సమాజాన్ని ఏకం చేద్దాం!

కులాల గడపలు దాటుదాం.. హిందూ సమాజాన్ని ఏకం చేద్దాం!​

చెన్నారావుపేట ధర్మ సమ్మేళనంలో శంఖారావం

​కులాల గోడలు బద్ధలు కొడదాం.. ధర్మాన్ని కాపాడుకుందాం

గడప లోపలే కులం.. గడప దాటితే హిందువులం అని చాటి చెప్పిన జనసందోహం

​కాషాయమయమైన సభా ప్రాంగణం.. అలరించిన సాంస్కృతిక నృత్యాలు

 

చెన్నారావుపేట జూన్ 11 ప్రజావాణి

​సమాజంలో కులాల పేరిట ఉన్న చీలికలను పక్కనబెట్టి, ధర్మ రక్షణ కోసం హిందువులంతా ఒక తాటిపైకి రావాలని ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని చెన్నారావుపేట వేదికగా ప్రముఖులు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని శివాలయంలో నిర్వహించిన హిందూ ధర్మ సమ్మేళనం సరికొత్త సామాజిక మార్పునకు నాంది పలికింది.గడప లోపలే కులం- గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనం స్థానికంగా సరికొత్త ధార్మిక చైతన్యానికి వేదికైంది. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభా ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. సమ్మేళనానికి హాజరైన సాధువులు, ముఖ్య వక్తలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు హిందూ ధర్మంపైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటి పరిధి దాటిన తర్వాత కుల భేదాలను విస్మరించి, హిందువులంతా ఒక్కటే అనే భావనతో ముందుకు సాగినప్పుడే ధర్మాన్ని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. మారుతున్న కాలంలో యువత తమ మూలాలను మరువకుండా, సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పాలని కోరారు.​సమ్మేళనంలో పాల్గొన్న భక్తులంతా కాషాయ కండువాలు ధరించి, జై శ్రీరామ్, హరహర మహాదేవ స్మరణలతో ప్రాంగణాన్ని మారుమోగించారు. .​ధార్మిక ప్రసంగాలతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను కట్టిపడేశాయి.సాంప్రదాయ భరతనాట్యం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ ధర్మ సమితి ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, చెన్నారావుపేట గ్రామస్తులు, పలు గ్రామాల ప్రజలు,పెద్ద సంఖ్యలో పాల్గొని, సమ్మేళనాన్ని ఘనంగా విజయవంతం చేశారు.