prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 10:34 am Digital Edition : RAKESH PEDDAPALLY

కులవివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి నాయకత్వం శ్రమించాలి: చెన్నూరి శ్రీనివాస్ మాదిగ

 

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో MRPS, MSP మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం

పెద్దపల్లి, జూలై 27 ప్రజావాణి :

కులవివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం MRPS, MSP నూతన కమిటీల నిర్మాణాలపై నాయకత్వం అహర్నిశలు శ్రమించాలని, ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వం కోసం జరిగే పోరాటాలకు ప్రతీ ఒక్కరూ సిద్ధం కావాలని MRPS, MSP పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి చెన్నూరి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన MRPS, MSP మరియు అనుబంధ సంఘాల అత్యవసర జిల్లా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా చెన్నూరి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ… ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు ప్రతీ కులానికి చెందాలనే ఉద్దేశంతో చేసిన న్యాయమైన పోరాటంలో విజయం సాధించామని పేర్కొన్నారు. నిరంతర శ్రమ, జాతి సంకల్పబలం, ఐక్యత మరియు వివిధ సందర్భాల్లో ప్రదర్శించిన శక్తి వల్లే ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగిందని అన్నారు. వర్గీకరణ కేవలం సాధించడమే కాకుండా, సమాజంలోని ప్రతీ పేద కుటుంబానికి ఉపయోగపడేలా ఎన్నో పోరాటాలు చేసి అన్ని పేద వర్గాలకు ఫలాలు అందించామని వివరించారు.

జాతి సమగ్ర అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలని, ఇందుకోసం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతీ విభాగంలో నూతన కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలోని నాయకులు అహర్నిశలు కష్టపడి అన్ని విభాగాలకు కమిటీలు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. మనతో కలిసివచ్చే వర్గాలను ఒక విముక్తి సైన్యంగా తీర్చిదిద్దడానికి ఈ కమిటీల నిర్మాణం ఎంతగానో సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అత్యవసర సమావేశంలో జిల్లా సీనియర్ నాయకులు అంబాల రాజేందర్ మాదిగ, కన్నూరి ధర్మేందర్ మాదిగ, పల్లె బాపు మాదిగ, రాసపెల్లి రవికుమార్ మాదిగ, మడిపెల్లి దశరథం మాదిగ, అగ్గిమల్ల కొమురయ్య మాదిగ, పెర్క సాగర్ మాదిగ, తిప్పరాపు లక్ష్మణ్ మాదిగ, దాసరి కిషన్ మాదిగ, కాశిపేట రాజయ్య మాదిగ, ఎదుల్ల ప్రవీణ్ మాదిగ, కన్నూరి ఓదెలు మాదిగ, కల్వల మల్లేష్ మాదిగ, కొంకటి లింగమూర్తి మాదిగ, రాము మాదిగ, అజయ్ మాదిగతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.