prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 6:31 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గం – మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్రన్

ఘట్‌కేసర్, జూన్ 13: కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్య పోరాటమే ఏకైక మార్గమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్రన్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ కార్మికుల సదస్సు శనివారం ఘట్‌కేసర్ మహిళా భవన్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవిచంద్రన్ మాట్లాడుతూ, మున్సిపాలిటీల నుంచి జీహెచ్‌ఎంసీలో విలీనం అయిన కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, విధుల్లో మరణించిన లేదా అనారోగ్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.

జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, కొన్ని సర్కిళ్లలో వాటర్‌మెన్, ఎలక్ట్రిషియన్‌లు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో కోతలు విధించడం అన్యాయమని అన్నారు. కార్మికుల హాజరు పట్టికలను పూర్తిగా పరిశీలించి వారికి రావలసిన పూర్తి వేతనాలను ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పండుగ సెలవులు, క్యాజువల్ లీవులు అమలు చేయాలని కోరారు.

మున్సిపల్ సంఘం కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాలుగో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమానికి కామ్రేడ్ ఎం. రామ్‌చందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఏఐటీయూసీ నాయకులు కల్లూరి జైచంద్ర, ఘట్‌కేసర్ మండల సీపీఐ కార్యదర్శి లొట్టి ఈశ్వర్, మద్దిలేటి, మున్సిపల్ రాష్ట్ర నాయకులు, ఘట్‌కేసర్ సర్కిల్ అధ్యక్షురాలు సువర్ణ, శ్రీరాములు, దాసు, అశోక్, అరుణ, ఎస్. లక్ష్మి, రామ్‌కుమార్, రాజు, భారతమ్మ, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.