కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ ఆకస్మిక సోదాలు
అవినీతికి అడ్డాగా మారిన మున్సిపాలిటీపై దాడి – అధికారుల్లో కలకలం
ప్రజావాణి | కామారెడ్డి జిల్లా ప్రతినిధి | మార్చి 16
కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. నిజామాబాద్ రేంజ్‌కు చెందిన ఏసీబీ అధికారులు విశ్వసనీయ సమాచారం ఆధారంగా 16-03-2026న మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.
ఈ సోదాల సమయంలో రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులు, కార్యాలయ నిర్వహణ విధానాలను పరిశీలించిన అధికారులు అనేక అక్రమాలు గుర్తించి విస్మయం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో “చెయ్యి తడిపితేనే ఫైలు కదులుతుంది” అనే ఆరోపణలకు తగిన ఆధారాలు బయటపడుతున్నాయనే చర్చ నెలకొంది. ఈ దాడులతో కొంతమంది అధికారుల్లో ఆందోళన వ్యక్తమైందని సమాచారం.
గుర్తించిన ముఖ్య అంశాలు:
2025-2026 సంవత్సరాల్లో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చినప్పటికీ, నోటీసులు ఇచ్చిన తరువాత కూడా అనేక కేసుల్లో తదుపరి చర్యలు తీసుకోలేదు.
400కు పైగా కమర్షియల్ షాపులు ట్రేడ్ లైసెన్స్ రిన్యూవల్ చేయకపోవడంతో సుమారు ₹1 కోటి ప్రభుత్వ ఆదాయం బకాయి పడింది.

ప్రాపర్టీ ట్యాక్స్ అంచనాల్లో తేడాలు ఉండటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు ఫీల్డ్ వెరిఫికేషన్‌లో గుర్తించారు.
మున్సిపల్ అధికారుల వాహనాల ఇంధన ఖర్చుల కోసం నెలకు ₹12.40 లక్షలు కేటాయించినప్పటికీ, సరైన రికార్డులు నిర్వహించలేదు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు హాజరు కాకపోయినా, పూర్తి జీతాలు పొందినట్లు రికార్డుల్లో నమోదు చేసిన అంశం బయటపడింది.
డిసెంబర్ 2025 నుంచి ఇప్పటివరకు వచ్చిన 169 బిల్డింగ్ అనుమతి దరఖాస్తుల్లో 18 దరఖాస్తులు నిర్ణీత 21 రోజుల గడువు దాటినా పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ వ్యవహారాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ఘటనతో కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి అంశంపై పెద్ద చర్చ మొదలైందని, రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు ఉండొచ్చని సమాచారం.