prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 5:20 am Digital Edition : PRAJA VANI

కామారెడ్డిలో కిరాతక హత్యవివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల కుమారుడిని హత్య చేయించిన తల్లి

కామారెడ్డిలో కిరాతక హత్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల కుమారుడిని హత్య చేయించిన తల్లి

ప్రజావాణి
ఏప్రిల్:18
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

కామారెడ్డిలో ఐదేళ్ల బాలుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల లోతైన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్నతల్లే తన ప్రియుడితో కలిసి పన్నాగం పన్ని కుమారుడిని హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై పట్టణ సీఐ నరహరి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం… రాజంపేటకు చెందిన రజిత అలియాస్ లక్ష్మీకి ఆర్గొండ గ్రామానికి చెందిన భాస్కర్‌తో 2014లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు శ్రావణ్, ఎనిమిదేళ్ల కూతురు సమీరా ఉన్నారు.
భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆరు నెలల క్రితం లక్ష్మీ తన ఇద్దరు పిల్లలతో కలిసి కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఆమె కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే లక్ష్మీనర్సింలుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
అయితే ఆ సంబంధానికి తన కుమారుడు శ్రావణ్ అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మీ, లక్ష్మీనర్సింలుతో కలిసి హత్యకు పన్నాగం పన్నింది. శుక్రవారం విధులకు వెళ్లిన సమయంలో బాలుడిని లక్ష్యంగా చేసుకుని లక్ష్మీనర్సింలు గొంతు పిసికి, నోరు-ముక్కు మూసి నేలకేసి కొట్టి కంట్లో కారం చల్లి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై రాజంపేటకు చెందిన లక్ష్మీ బాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని తేలడంతో లక్ష్మీతో పాటు లక్ష్మీనర్సింలును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.