కాకరవాయి గుడి మాన్యం…భూములే కాదు, పేర్లూ ‘మాయం’ అయ్యాయా..?
వార్తలు వరుసగా… చర్యలు మాత్రం శూన్యం..!
12 ఎకరాలు అంటారు… రికార్డుల్లో మాత్రం ‘జీరో’..!
కుందూరు గోపక్క దొరసాని పేరు ఎక్కడ..? లేక చరిత్రనే తుడిచేశారా..?
అర్చకుడిపై ఆరోపణలు – అధికారులు మాత్రం ‘మౌన దీక్ష’లో..!
తిరుమలాయపాలెం, ప్రజావాణి:
కాకరవాయి గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి సంబంధించిన మాన్యం భూముల వ్యవహారం రోజురోజుకూ మరింత అనుమానాస్పదంగా మారుతున్నా, సంబంధిత అధికారుల వైఖరి మాత్రం “ఏమీ జరగనట్టే” కొనసాగుతుండటం గ్రామస్థుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. గతంలో ఈ అంశంపై వార్తలు వెలువడినా… ప్రశ్నలు లేవనెత్తినా… ఇప్పటివరకు ఒక్క స్పష్టమైన స్పందన కూడా రాకపోవడం గమనార్హం.గ్రామ పెద్దలు చెబుతున్న వివరాల ప్రకారం సుమారు 60 నుంచి 70 సంవత్సరాల క్రితం కుందూరు గోపక్క దొరసాని దేవాలయానికి మాన్యం భూములు ఇచ్చినట్టు చెబుతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — ఆ దాత పేరు ప్రస్తుత అధికారిక రికార్డుల్లో ఎక్కడా కనిపించకపోవడం. ఇది సాధారణ తప్పిదమా..? లేక ఎవరైనా చరిత్రనే కాగితాల నుంచి చెరిపేశారా..? అన్న అనుమానాలు గ్రామంలో బలంగా వినిపిస్తున్నాయి.“భూములు కనిపించవు… రికార్డులు కనిపించవు… దాత పేరు కనిపించదు… మరి ఈ మాన్యం నిజంగానే ఉందా..? లేక ఎవరో చెప్పిన కథ మాత్రమేనా..?” అంటూ గ్రామస్థులు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. గుడి పేరిట సుమారు 12 ఎకరాల మాన్యం ఉందని చెబుతుంటే, ఆ భూముల జాడ మాత్రం అధికారిక పత్రాల్లో లేకపోవడం ఈ వ్యవహారాన్ని మరింత సందేహాస్పదంగా మారుస్తోంది.ఇంకా విచిత్రమేమిటంటే — ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా మౌనంగా ఉండటం. “ఎంత పెద్ద విషయం అయినా… కొద్ది రోజులు మాట్లాడుకుంటారు… తర్వాత మర్చిపోతారు” అన్న నమ్మకంతో వ్యవహరిస్తున్నారా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.దేవాలయ ప్రధాన అర్చకుడిపై వస్తున్న ఆరోపణలు కూడా ఇప్పటివరకు ఏదైనా అధికారిక విచారణకు దారి తీసిన దాఖలాలు కనిపించకపోవడం మరింత విమర్శలకు కారణమవుతోంది. గుడి ఆస్తులపై పూర్తి వివరాలు బయటపెట్టాల్సిన బాధ్యత ఉన్నవారు ముందుకు రాకపోవడం వల్ల ఈ ‘మాన్యం మిస్టరీ’ రోజురోజుకూ మరింత ముదురుతోంది.“దాత పేరు కూడా కనిపించకపోవడం అంటే… అది నిర్లక్ష్యమా..? లేక నిశితంగా చేసిన ‘మాయం’నా..?” అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. చరిత్రలో ఉన్న పేర్లు కూడా ఇలా కాగితాల నుంచి అదృశ్యమవుతుంటే, గుడి భూముల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటున్నారు.ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపడతారా..? గుడి మాన్యం భూముల అసలు నిజాలు, దాతల పేర్లు ప్రజలకు వెల్లడిస్తారా..? లేక ఇదీ మరో “మర్చిపోయే కథ”గా మిగిలిపోతుందా..? అన్నది వేచి చూడాల్సిందే.గ్రామంలో పెరుగుతున్న ఆగ్రహం చూస్తుంటే… ఇక మౌనం కొనసాగితే పరిస్థితి మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. “మాన్యం బయటపెట్టాలి… లేకపోతే మేమే బయటపెడతాం” అంటూ గ్రామస్థులు హెచ్చరిస్తుండటం గమనార్హం.