prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 10:11 pm Digital Edition : RAKESH PEDDAPALLY

ఎల్లంపల్లి నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల: గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 

ప్రాజెక్టు, గోదావరి ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏసీపీ ఎం. రమేష్

గోదావరిఖని, జూలై 30 ప్రజావాణి :

ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక, దిగువ ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం  రామగుండం సీఐ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి ప్రవాహ పరిస్థితులు, విడుదలవుతున్న నీటి పరిమాణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున దిగువ ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమ్మక్క దేవాలయం సమీపంలోని గోదావరి వంతెన వద్ద ఉన్న గోదావరి ఘాట్‌ను సందర్శించి, ఎల్లంపల్లి నుంచి గోదావరి నదిలోకి విడుదలవుతున్న నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు, మత్స్యకారులు మరియు నదీతీర ప్రాంతాలకు వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అధికారులు జారీ చేసే హెచ్చరికలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నందున అనవసరంగా నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం మరియు సెల్ఫీలు తీసుకునేందుకు నది ఒడ్డుకు చేరుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ వెంకట్  ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.