prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 9:09 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం

– రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరగాలి
– కౌలు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి
– కృత్రిమ కొరత, మళ్లింపులను అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలి
– జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్

అమరావతి,జూన్ 7 ప్రజావాణి రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఎరువుల పంపిణీని ఏపీఎఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా అమలు చేసే అంశంపై ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని 28 జిల్లాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్త విధానం అమలుతో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి జిల్లా, క్షేత్రస్థాయిలో విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ డిమాండ్, ఎరువుల మళ్లింపు, రైతుల్లో అనవసర ఆందోళనలను అరికట్టాలని ఆదేశించారు. వివిధ పంటలకు అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. పంటల సరళి, అంచనా డిమాండ్ ఆధారంగా మండల స్థాయిలో ముందస్తుగా ఎరువుల నిల్వలు ఉంచాలని సూచించారు. గత ఏడాది ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణ, కాకినాడ జిల్లాల్లో ఫైలేట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి ఎఫ్ ఎఫ్ ఎస్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని, మిగతా 26 జిల్లాల్లో ఏపీఎఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు జరుగుతుందని వెల్లడించారు. ఎరువుల పంపిణీ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.సీఎం కార్యదర్శి రాజమౌళి మాట్లాడుతూ ఎరువుల మళ్లింపును అరికట్టేందుకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ విశ్లేషణాత్మక నివేదికలు సమర్పించాలని, రైతుల సమస్యల పరిష్కారానికి రియల్‌టైమ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకుంటూ సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి రైతులకు పారదర్శక, వేగవంతమైన ఎరువుల పంపిణీని నిర్ధారించాలని అన్ని జిల్లాల అధికారులకు సమావేశం ముగింపులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ ఏపీఎఐఎంఎస్ 2.0 అభివృద్ధి పురోగతి, జిల్లాల సన్నద్ధతపై వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాలకు (ఆర్‌ఎస్‌కేలు) లాగిన్ వివరాలు అందజేసినట్లు తెలిపారు. ఖరీఫ్-2025 ఈ-క్రాప్ బుకింగ్ పరిధిలో ఉన్న రైతుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎరువుల రిటైలర్లు, పీఏసీఎస్‌లను ఏపీఎఐఎంఎస్ 2.0లో నమోదు చేసి సంబంధిత రైతు సేవా కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల రైతులు తమకు సమీపంలోని గుర్తింపు పొందిన రిటైలర్ల ద్వారా ఎరువులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన సాధారణ ఎరువుల సిఫార్సుల ఆధారంగానే ఎరువుల కేటాయింపు జరుగుతుందని చెప్పారు.