prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:06 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు ప్రజలపై భారం తక్షణమే ధరల పెంపును ఉపసంహరించాలి – కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి

ప్రజావాణి కడప డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3కు పెంచడం ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపినట్లేనని ఆమె విమర్శించారు.ఈ ధరల పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.75 నుండి రూ.113.03కు, డీజిల్ ధర రూ.97.57 నుండి రూ.100.71కు పెరిగిందని ఆమె తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ వైఫల్యాల ఫలితమే ప్రజలు ఈ భారాన్ని మోయాల్సి వస్తోందని విజయ జ్యోతి ఆరోపించారు. 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు రూ.2 తగ్గింపు పేరుతో ప్రజలకు ఇచ్చిన ఉపశమనం ఇంకా పూర్తిగా అనుభూతి కాకముందే మళ్లీ భారీ పెంపు చేయడం ప్రజలను మోసం చేసినట్లేనని ఆమె అన్నారు. భవిష్యత్తులో మరిన్ని వసూళ్లకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.ఇంధన ధరల పెంపు ప్రభుత్వ నాయకత్వ సంక్షోభానికి, పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీఖ్ ఖాన్, శీలం గంగయ్య ,షామీర్ హుస్సేన్ పాల్గొన్నారు