పోచారం, జూన్ 29: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్‌ఆర్ కండ్రిక గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ (40) గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసముంటూ హైటెక్ సిటీలోని ఎన్‌టిటి డేటా సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి పోచారంలోని ఏఎస్‌బీఎల్ స్ప్రింగ్స్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో పాటు ఉద్యోగ సంబంధిత ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదివారం ఉదయం ఆరోగ్యం బాగోలేకపోయినా కంపెనీలో నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన మహేష్ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసినా స్పందించలేదు. అతని సహోద్యోగి నవీన్‌ను సంప్రదించగా సాయంత్రం అన్నోజిగూడ డీమార్ట్ సమీపంలో దింపినట్లు తెలిపాడు.
అనంతరం కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ‘ఫైండ్ మై డివైస్’ సాయంతో అతని లొకేషన్ చౌదరిగూడలోని సెటన్ హోటల్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని గది నంబర్ 206లో పరిశీలించగా మహేష్ తెల్లని బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు.
భర్త అనారోగ్యం, ఉద్యోగ ఒత్తిడి కారణంగానే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని భార్య కాకర్ల నిరోషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.