కడప జిల్లా ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)ఉద్యోగ,ఉపాధ్యాయులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జాబీర్ హెచ్చరించారు.యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం కడప కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్.జాబీర్ మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ప్రతిపక్ష హోదాలో కూటమి పెద్దలు ఉద్యోగ,ఉపాధ్యాయులకు అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు.తాము అధికారంలోకి వస్తే 12వ పిఆర్సీని అమలు చేసి ఉద్యోగ,ఉపాధ్యాయ మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఆర్థిక బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తామని,డిఏ లను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని,సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా హామీల అమలులో చిత్తశుద్ధి కనపరచడం లేదన్నారు. పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు అయిందని,అయినప్పటికీ పిఆర్సీ కమిషన్ ను ఏర్పాటు చేయడంలో తీవ్ర తాత్సారం చేస్తున్నదని విమర్శించారు.పిఆర్సీ అమలుకు నోచుకోకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ,ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అధికారం చేపట్టిన ఆరు మాసాలలోగా చెల్లిస్తామన్న ఆర్థిక బకాయిలు, రెండేళ్లయినా పూర్తి చెల్లింపులకు నోచుకోలేదన్నారు. కేవలం 9,500 కోట్ల బకాయిలు మాత్రమే చెల్లించి, ఉద్యోగుల బకాయిలన్నింటిని చెల్లించినట్లు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటన చేయడం ఉద్యోగులను వంచించడమేరన్నారు.ఇంకా 30 వేల కోట్ల పైబడిన బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్ ఉద్యమాలు చేపడుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు, అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడి చేపడతామని ఆయన హెచ్చరించారు.ఏపీ జెఎసి జిల్లా చైర్మన్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయులు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు.గత వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సీని అమలు చేసి ఉద్యోగ,ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొద్ది మేరకు ఆర్థిక బకాయిల్ని చెల్లించినప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లింపులు చేపట్టకపోవడం తగదన్నారు.ఆర్థిక బకాయిలపై రోడ్ మ్యాప్ ప్రకటించి నిర్ణీత గడువులోగా బకాయిలను చెల్లించాలని కోరారు.కూటమి ప్రభుత్వం సైతం గత ప్రభుత్వ విధానాలనే అమలు చేయడం తగదన్నారు. సమస్యల పరిష్కారం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోతే పోరాటమే శరణ్యం అన్నారు.
యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ పాలకవర్గాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారపక్షంలోకి రాగానే మరోరకంగా వ్యవహరించడం తగదన్నారు.ప్రతిపక్ష హోదాలో ఉద్యోగ ,ఉపాధ్యాయుల సమస్యలపై మొసలి కన్నీరు కార్చిన కూటమి పెద్దలు గద్దెనెక్కగానే ఉద్యోగుల సమస్యలను విస్మరించడం ఏంటని ప్రశ్నించారు. సకాలంలో డిఏలు చెల్లించకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించిన కూటమి పెద్దలు నేడు మూడు డిఏ లను పెండింగ్లో ఉంచడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నారు.ఉద్యోగ,ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్న కూటమి నేతలు ఆ వైపుగా ఒక్క అడుగు కూడా వేయకపోవడం దుర్మార్గమన్నారు. కరోనా మహమ్మరితో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నదన్నారు. మూడేళ్లుగా సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపులు లేవన్నారు.ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు చెల్లని రూకలా ఉన్నాయన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.సిఐటియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసులు రెడ్డి,బి.మనోహర్, ఎల్ఐసి డివిజన్ కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి, జెవివి రాష్ట్ర నాయకులు బి.రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం సాగిస్తున్న యుటిఎఫ్ దీక్షలకు తాము పూర్తి సంఘీభావం,మద్దతు తెలియజేస్తున్నామన్నారు.అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదన్నారు. ఉద్యోగులు ఆగ్రహిస్తే ఏమి జరిగిందో పాలకులకు తెలియనిది కాదన్నారు. తక్షణమే స్పందించి సంఘాల నాయకులను చర్చలకు పిలిపించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు.ఏపీ జెఎసి,ఏపీ ఎన్జీవో,పెన్షనర్స్ అసోసియేషన్,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్,ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల సంఘం,జన విజ్ఞాన వేదిక తదితర సంఘాల నాయకులు దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.150 మంది ఉపాధ్యాయులు దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శైలేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు,ఏపీ ఎన్జీవో నాయకులు కె.చిన్నయ్య, పద్మనాభరావు యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎన్.నాగార్జున రెడ్డి,సహాధ్యక్షులు వై.రవికుమార్,ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు కె.చెన్నయ్య, సి.వి.రమణ,ఎస్.ఎజాస్ అహ్మద్,పి.వెంకటసుబ్బయ్య,క.మురళీకృష్ణ,కె.సుధాకర్,జి.గోపీనాథ్,కంబగిరి,సి.వి.రమణమూర్తి, జె.సుబ్బారెడ్డి ఎం.శ్రీనివాసులు,సి.సుదర్శన్,డి.సుబ్బారావు,ఎ.వీరనారాయణ ఎ.శ్రీనివాసులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు,ఎ.డి.దేవదత్తం,జి.చెంగల్ రాజు,బి.లక్ష్మీ ప్రసన్న, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్,ఆడిట్ కమిటీ జిల్లా కన్వీనర్ ఎం.ప్రభాకర్,వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు.