*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:-
జన్మస్థలం మనిషిని నిర్ణయించదు.వారి సంకల్పమే శిఖరాలను నిర్ణయిస్తుంది. ఈ వాక్యానికి సజీవ నిదర్శనం డాక్టర్ పూజిత (IRS).
సవాళ్లకు, సంఘర్షణలకు ప్రతీకగా నిలిచిన కడప నేలపై జన్మించిన ఆమె… ఉప్పెనను ఛేదిస్తూ తీరం చేరిన అలలా, ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ దేశ అత్యున్నత సేవా శిఖరాలను అధిరోహించిన ఉక్కు మహిళ.
వినయం ఆమెకు ఆభరణం… ఆత్మవిశ్వాసం ఆమెకు ఆయుధం… సేవాభావం ఆమెకు జీవన తత్వం. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండటం, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం, సమస్యలను సహనంతో, చాకచక్యంతో పరిష్కరించడం ఆమె వ్యక్తిత్వానికి ప్రతిబింబం.
సమ్మక్క–సారలమ్మల పోరాట స్ఫూర్తి, చాకలి ఐలమ్మ ధైర్యం, రాణి రుద్రమదేవి వీరత్వం, సావిత్రిబాయి ఫూలే విద్యా స్పూర్తి—ఈ నాలుగు మహనీయుల స్ఫూర్తి ఆమెలో ప్రతిధ్వనించినట్లు ఆమె జీవితం చెబుతోంది.
దేవుడిని నమ్ముతాను… కానీ నా విజయాన్ని దేవుడిపై వదిలేయను. నా కృషినే నా అదృష్టంగా మలుచుకుంటాను” అనే భావజాలంతో ఆమె ప్రతి అడుగు ముందుకు వేసింది.
విద్యార్థి దశలో ఎన్నో అవమానాలు, బంధువుల నిరుత్సాహపరిచే మాటలు, సామాజిక ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. వైద్య విద్య కోసం చేసిన పోరాటంలో NEET పరీక్షలో విజయం సాధించింది. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, ధైర్యంగా వాటిని అధిగమించి వైద్య విద్యను విజయవంతంగా పూర్తిచేసింది.డాక్టర్‌గా అనేకమంది ప్రాణాలను కాపాడుతూ సేవలందించినా, ఆమె మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ మిగిలింది.ఇంకా విస్తృతంగా దేశానికి సేవ చేయలేనా?” ఆ ప్రశ్నే ఆమె జీవితాన్ని కొత్త దిశగా మలిచింది.
తండ్రి ప్రోత్సాహం, తల్లి ప్రేమ, తనపై తనకున్న అపార విశ్వాసం—ఈ మూడు శక్తులను బలంగా చేసుకుని UPSC అనే మహాయజ్ఞంలో పాల్గొని, అచంచల దీక్షతో చదివి ఆల్ ఇండియా 282వ ర్యాంకు సాధించి భారత రెవెన్యూ సేవ (IRS)లో స్థానం సంపాదించింది.
శిక్షణ అనంతరం ఆమె ప్రతిభను, అంకితభావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. దేశ భద్రత, పరిపాలన, ప్రజా సేవల రంగాల్లో ఆమె తన విశిష్ట సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆమె భర్త కూడా భారత సాయుధ దళాల్లో ఉన్నతాధికారిగా దేశసేవలో కొనసాగుతుండటం విశేషం. దేశ రక్షణ, దేశ పరిపాలన—ఈ రెండు రంగాల్లోనూ తమ కుటుంబాన్ని దేశానికి అంకితం చేసిన అరుదైన దంపతులుగా వారు నిలిచారు.డాక్టర్ పూజిత జీవితం ప్రతి యువతికి, ప్రతి యువకుడికి ఒక సందేశం—
పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి… కానీ పట్టుదల మనల్ని చరిత్రలో నిలబెడుతుంది. కష్టాలు శాశ్వతం కావు… సంకల్పమే విజయానికి చిరునామా.”
ఆమె ప్రయాణం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు… లక్షలాది కలలకు వెలుగునిచ్చే ప్రేరణ. ఆకాశమే హద్దు కాదని, ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందని నిరూపించిన స్ఫూర్తిదాయక మహిళ డాక్టర్ పూజిత అని నాగరాజు అన్నారు.