prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 2:09 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

ఘట్‌కేసర్, మే 12 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌గూడలోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవతా సమేత శ్రీ రేణుక ఎల్లమ్మదేవి దేవాలయంలో మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మదేవి 37వ వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

ఈ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఈగ లలిత కృష్ణ ముదిరాజ్, ఆలయ ధర్మకర్తలు ఈగ మధు ముదిరాజ్, ఈగ నందిని రాము ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి ఆశీస్సులు పొందారు.

కళ్యాణ మహోత్సవంలో నగర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. మంగళవాయిద్యాలు, ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నడుమ ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.

ఎంతో మహిమగల ఈ దేవాలయంలో భక్తులు కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని స్థానికులు విశ్వసిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.