బెజ్జంకి, జూలై 9 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలోని సాగునీటి కాలువను సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుగ్గిల గ్రామ పరిసరాల్లోని ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు సాగునీటి కాలువ ద్వారా తోటపల్లి చెరువులోకి చేరుతున్నాయని ఆరోపించారు.ఈ వ్యర్థాల కారణంగా తోటపల్లి చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయని, ప్రాజెక్టు పరిధిలోని వ్యవసాయ భూములు, పంటలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.కాలువలో దుర్వాసన వెదజల్లుతుండటంతో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి నెలకొందని, పశువులు కూడా ఆ నీటిని తాగలేకపోతున్నాయని తెలిపారు. ఇప్పటికే కాలువ నీరు తాగిన గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల కాపరులు చెబుతున్నారని, చెక్‌డ్యామ్‌లో చేపలు కూడా చనిపోవడంతో మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.ఇథనాల్ ఫ్యాక్టరీల కాలుష్యంతో పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడిందని, వెంటనే ఫ్యాక్టరీలను మూసివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం, గ్రామస్తులు గాజే రాజు,ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.