ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మట్టి దందా?
అధికారుల అనుమతులు లేవంటున్న ఎంపీడీవో
ఇరిగేషన్ పర్మిషన్ ఉందంటూ రెచ్చిపోతున్న వ్యాపారులు
పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం.. గ్రామస్థుల ఆగ్రహం
చెన్నారావుపేట మే 28 ప్రజావాణిమండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కొందరు వ్యాపారులు యథేచ్ఛగా మట్టి (మొరం) దందా సాగిస్తున్నట్లు స్థానిక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే పూర్తికావచ్చాయని, అయితే కొంతమంది స్వార్థపరులు ఇండ్ల పేరు వాడుకుంటూ స్థానిక చెరువు నుండి జేసీబీ సహాయంతో మట్టిని తవ్వి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.గతంలో ప్రభుత్వ పాఠశాల అవసరాల కోసం చెరువు నుండి మొరం తరలించడానికి అనుమతి కోరగా అప్పటి కలెక్టర్ నిరాకరించారని, మరి ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారులకు ఈ దందా చేయడానికి అనుమతులు ఎలా లభించాయని సామాన్యులు, రైతులు ప్రశ్నిస్తున్నారు.ఈ మట్టి తవ్వకాలపై స్థానిక ఎంపీడీవోను వివరణ కోరగా.. తాము కేవలం రిక్వెస్ట్ లెటర్ మాత్రమే పెట్టామని, తమ తరఫున ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అయితే, మట్టి దందా నిర్వహిస్తున్న వ్యాపారులు మాత్రం తమకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ (నీటి పారుదల శాఖ) నుండి స్పష్టమైన అనుమతులు ఉన్నాయంటూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు.స్థానిక మండల రెవెన్యూ అధికారి (తాహసిల్దార్), ఎంపీడీవోలకు సమాచారం లేకుండా చెరువులను గుల్ల చేస్తూ, ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న మట్టి మాఫియాపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ మట్టి దందాను అరికట్టాలని ఉప్పరపల్లి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.