ఘట్‌కేసర్, జూలై 27: ఘట్‌కేసర్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధ మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని అపహరించి పరారయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జాల కేతమ్మ (70) అనే వృద్ధ మహిళ మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వేళ, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని ఎదులాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై వేగంగా పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ, నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.