ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు
శాంతిభద్రతల పరిరక్షణలో సంజీవయ్య సేవలు అభినందనీయం
గోదావరిఖని జూలై 31 ప్రజావాణి :
రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) కొంకటి సంజీవ్ కు శుక్రవారం ‘ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం’ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవయ్యను శాలువా, పూలమాలలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఉద్యోగ విరమణ అనేది ఒక సహజమైన ఘట్టమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం పాటు అంకితభావంతో సేవలందించిన కొంకటి సంజీవయ్య సేవలు ఎంతో ప్రశంసనీయమైనవని కొనియాడారు.
ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆయనకు ఏ అవసరం వచ్చినా పోలీస్ శాఖతో పాటు సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సంజీవయ్య దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో శేష జీవితాన్ని గడపాలని, వారి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధి మిట్టపల్లి రాజేందర్ కుమార్, నాయకులు పానుగంటి రాయలింగు, కొంకటి కనకరాజ్, కొంకటి సిద్ధార్థలతో పాటు పలువురు స్థానిక నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.