ఆపదలో ఉన్న తోటి కార్మికుడికి అండగా నిలిచిన సహచరులు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తోటి కార్మికులు కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వం అని నిరూపిస్తూ ఆదర్శంగా నిలిచారు. అనారోగ్యంతో మంచాన పడ్డ కార్మికుడికి ఆర్థిక సహాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు.
స్థానికంగా ఓసిపి త్రి వి9 కంపెనీలో పనిచేస్తున్న ప్రసాద్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ పనికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు. కుటుంబ పోషణ,వైద్య ఖర్చులకు సైతం ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న తోటి కార్మికులు చలించిపోయారు.వెంటనే అందరూ కలిసి తలా కొంత విరాళం సేకరించి,బాధిత కార్మికుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడి నివాసానికి చేరుకున్న తోటి కార్మికులు,సేకరించిన 42,400రూపాయల నగదును అతనికి అందజేశారు.మేమంతా ఒకే కుటుంబం. కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరం తోడుగా నిలవాలి.నువ్వు త్వరగా కోలుకొని మళ్లీ మాతో కలిసి పనిచేయాలి అంటూ ధైర్యం చెప్పారు.తోటి కార్మికుల ఆప్యాయత, సహాయానికి బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమైంది.కష్టకాలంలో అండగా నిలిచినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.