సైదాపూర్‌లో బాధితుడి ఆవేదన!
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):అమాయకత్వమే ఆసరాగా తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో అవుట్‌సోర్సింగ్ కొలువు పేరుతో ఓ సామాన్యుడి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే….సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన మారెప్ప భూపతి అనే వ్యక్తికి, చొప్పదండికి చెందిన సిరిపురం సంపత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు తెలిసిన పలుకుబడితో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని భూపతిని నమ్మించాడు. ఇందుకు ప్రతిఫలంగా అతని నుంచి రూ. 80 వేల నగదు తీసుకున్నాడు.డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు భూపతి, నిందితుడిని నిలదీశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, సంపత్ కాలయాపన చేస్తూ వచ్చాడు. గత కొంతకాలంగా బాధితుడు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన భూపతి, స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.చివరికి ఏ దారి లేక బాధితుడు గురువారం నాడు మీడియాను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును అప్పనంగా దోచుకున్న సంపత్ పై అధికారులు స్పందించి, తనకు న్యాయం చేయాలని, తన డబ్బులు తనకు ఇప్పించాలని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.