prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 12:59 pm Digital Edition : PRAJA VANI

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్‌కు అండగా నిలిచిన తోటి కార్మికులు

అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసాద్‌కు అండగా నిలిచిన తోటి కార్మికులు
మానవత్వాన్ని చాటుకున్న ఓసిపి త్రి ఫేస్-2 వి9 కంపెనీ రిలే-బి కార్మికులు

రామగిరి, జూన్ 28 (మన సమగ్ర ప్రజావాణి):
రామగిరి మండలం దుబ్బపల్లె గ్రామానికి చెందిన ప్రసాద్ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, అతనికి తోటి కార్మికులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓసిపి త్రి ఫేస్-2 వి9 కంపెనీ రిలే-బి కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి రూ.16 వేల ఆర్థిక సహాయాన్ని ప్రసాద్ కుటుంబానికి అందజేశారు.
ప్రసాద్ అనారోగ్యంతో కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలుసుకున్న సహచర కార్మికులు వెంటనే స్పందించి తమ వంతు సహాయాన్ని అందించారు. దుబ్బపల్లె గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కార్మికులు కలిసి ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలబడటం ప్రతి మనిషి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రసాద్ త్వరగా కోలుకుని తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు.
అనుకోని సమయంలో తమ కుటుంబానికి తోడుగా నిలిచిన సహచర కార్మికుల ఉదారత చూసి ప్రసాద్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తోటి మనిషి బాధను తమ బాధగా భావించి ముందుకొచ్చిన వి9 కంపెనీ రిలే-బి కార్మికుల సేవాభావం, మానవత్వానికి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు ప్రశంసించారు. ఇలాంటి సహాయ సహకారాలు సమాజంలో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.