మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):
చిగురుమామిడి మండలంలోని రామంచ వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలు, టిప్పర్లతో పగటిపూటే ఇసుకను భారీగా తవ్వి తరలిస్తున్నారని రామంచ సర్పంచ్ కిషన్ రెడ్డి, రైతులు ఆరోపిస్తున్నారు. పూడికతీత పేరుతో బహిరంగంగా జరుగుతున్న ఈ తవ్వకాలపై ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ, భారీ యంత్రాలతో వాగు తవ్వడం వల్ల సహజ ప్రవాహం దెబ్బతింటోందని, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. ట్రాక్టర్ల రాకపోకలతో గ్రామ రహదారులు దెబ్బతింటుండగా, ధూళి కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ విషయంపై పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని సర్పంచ్ కిషన్ రెడ్డి తెలిపారు. వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.