పోరుమామిళ్లలో కాలినడకన వెళ్లాలంటేనే ప్రజల ప్రాణసంకటం!
పోరుమామిళ్ల,ఆగస్టు01 ప్రజావాణి,కడప జిల్లాలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన పోరుమామిళ్ల పట్టణంలో నిబంధనలు తుంగలో తొక్కుతూ రోడ్లు,ఫుట్‌పాత్‌లను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నా.బాధ్యత గల అధికారులు మాత్రం గుర్రపు నిద్ర నటిస్తున్నారు.పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన,కాలినడకన వెళ్లేందుకు కేటాయించిన ఫుట్‌పాత్‌లపై ఇబ్బడిముబ్బడిగా వెలిసిన దుకాణాల వల్ల సామాన్య ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఈ దారుణాలపై స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నప్పటికీ,అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ ఎత్తున’ముడుపులు’ చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి!
పట్టణంలోని ప్రధాన కూడళ్లు,కూరగాయల మార్కెట్ పరిసరాలు,మరియు ముఖ్య రహదారులన్నీ ప్రైవేట్ దుకాణదారులు,తోపుడు బండ్ల నిర్వాహకుల చేతుల్లోకి వెళ్లిపోయాయి అనేక వ్యాపార సంస్థలు మరియు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు రోడ్ల మీదికే వచ్చి వ్యాపారాలు సాగిస్తున్నాయి.దుకాణాల ముందు ద్విచక్ర వాహనాలు,ఆటోలను ఇష్టానుసారంగా పార్క్ చేస్తుండటంతో కాలినడకన వెళ్లే సామాన్యులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రధాన రోడ్డుపై నడవాల్సి వస్తోంది.నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ రహదారులపై చిన్నపిల్లలు,వృద్ధులు నడవాలంటే భయాందోళన చెందుతున్నారు.
మూడు శాఖల ‘మామూళ్ల’ బంధం?
పట్టణంలో అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించాల్సిన బాధ్యత రెవెన్యూ,పంచాయతీ రాజ్, మరియు(రోడ్లు మరియు భవనాల) శాఖలపై ఉంది.కానీ,ఈ మూడు శాఖల సమన్వయ లోపం,ఉదాసీనత ఇప్పుడు పట్టణ ప్రజలకు శాపంగా మారింది. నిబంధనల ప్రకారం రోడ్డు మార్జిన్లను వదిలి వ్యాపారాలు చేసుకోవాల్సి ఉండగా,అధికారుల అండదండలతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.దుకాణదారుల నుండి నెలవారీగా అందుతున్న భారీ’మామూళ్ల’వల్లే అధికారులు ఈ సమస్యను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని,అందుకే ఎన్ని వార్తలు వచ్చినా వారిలో చలనం రావడం లేదని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
ప్రజా ఆగ్రహం.ఉన్నతాధికారులు స్పందించేనా?
కథనాల మీద కథనాలు రాస్తున్నా కదలని స్థానిక అధికారుల తీరుపై పట్టణ ప్రజలు,ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.కేవలంముడుపుల కోసమే ప్రజా భద్రతను గాలికొదిలేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు (కలెక్టర్,మరియు ఉన్నత పోలీసు అధికారులు) ప్రత్యేకంగా స్పందించి,పోరుమామిళ్ల పట్టణంలో తక్షణమే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫుట్‌పాత్ ఆక్రమణలను శాశ్వతంగా తొలగించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.