మేడ్చల్–మల్కాజిగిరి, మే 29 (ప్రజావాణి): దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు 2 బీహెచ్‌కే ఇళ్లను కేటాయించి అందించే నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందనీయమని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 25వ తేదీన తహసీల్దార్లు తప్పనిసరిగా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఆదేశించారు. ఆ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరై పౌరహక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను త్వరితగతిన జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
పోలీసు శాఖ అధికారులు పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేసుల పురోగతి కమిషన్‌కు స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఒకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండడం వల్ల కేసుల విచారణలో ఆలస్యం జరుగుతోందని, మరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి కమిషన్ చొరవ తీసుకోవాలని కోరారు.
సఫాయి కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, వారికి అవసరమైన పీపీఈ కిట్లు, రక్షణ సామగ్రి క్రమం తప్పకుండా అందేలా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్ అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టి సారించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ మాట్లాడుతూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాను కమిషన్ దత్తత తీసుకుందని తెలిపారు. అట్రాసిటీ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం సకాలంలో అందించాలని కోరారు. కేసుల నమోదు అనంతరం విచారణ దశలోనే నిబంధనల ప్రకారం పరిహారం అందించే చర్యలు చేపట్టాలని సూచించారు.
అట్రాసిటీ బాధితులకు 2 బీహెచ్‌కే ఇళ్లతో పాటు ఉపాధి అవకాశాలు, పెన్షన్ సౌకర్యాలు కల్పించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు సహకరించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే పౌరహక్కుల రక్షణ చట్టం (పీసీఆర్), అట్రాసిటీ నివారణ చట్టం (పీవోఏ)లను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, డీవీఎంసీ సభ్యులు బిట్ల వెంకటేశ్వర్లు, ధనరాజ్ నాయక్, పాకాల అశోక్, బాబురావు, నాగేష్, తాల్క రాములు, శ్రవణ్ గిరి, మంచాల యాదగిరి, నమిత, డీఆర్ఓ మాలతి, ఆర్డీవోలు రాజేష్ కుమార్, శ్యాంప్రకాష్, పోలీసు ఉన్నతాధికారులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోజెస్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
