అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం – కొందుర్గు ప్రజలకు విద్యా వరం
కొందుర్గు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. పురుషోత్తం రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషితో ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కొందుర్గు మండలానికి మంజూరైందని పేర్కొన్నారు.
ఇటీవల స్లాబ్ పనులు పూర్తయ్యాయని, మిగతా నిర్మాణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల బృందం పనులను పరిశీలించిన సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల రూపకల్పనకు శ్రీకారం చుట్టారని అన్నారు.
వెనుకబడిన కొందుర్గు మండలానికి ఈ పాఠశాలను కేటాయించడం ద్వారా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ ప్రాంతంపై తన ప్రత్యేక అభిమానం చాటుకున్నారని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ విద్యాసంస్థ భవిష్యత్తులో కొందుర్గును విద్యా అభివృద్ధి కేంద్రంగా మార్చనుందని అభిప్రాయపడ్డారు.
అలాగే ఉమ్మడి మండల అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరంతరం కృషి చేస్తున్నారని, పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో భూసేకరణ తదితర ప్రక్రియలు ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆర్థికంగా, విద్యాపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మల్లేష్ గౌడ్, అంజి రెడ్డి, సీనియర్ నాయకులు రాములు గౌడ్, ఎస్సీ సెల్ నాయకుడు నరేందర్, నరేందర్ గౌడ్, రాజ్ కుమార్, మాదారి నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి, శివకుమార్, సిద్ధు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.